– విండీస్ బౌలర్లను చితకబాదుతున్న టీమిండియా బ్యాటర్లు
– తొలి టెస్టులో యశస్వీ, రోహిత్ శతకాలు
– ఆరంగేట్రంలోనే ఆదరగొడుతున్న తెలుగు కుర్రోడు
WI vs IND First Test Match డొమినికా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆరంగేట్ర బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కారు. ఓవర్ నైట్ స్కోర్ 80/0తో గురువారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ఓవైపు స్కోర్ బోర్డును పెంచుతూనే ఓపెనర్లు ఇద్దరూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో అథనాజే వేసిన వేసిన 69వ ఓవర్‌లో తొలి బంతికి సింగిల్ తీసిన యశస్వీ ఆడిన తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అథనాజే బౌలింగ్‌లోనే బౌండరీ సాధించి, కెరీర్‌లో తన 10వ సెంచరీని నమోదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ (103) అథనాజే బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన మరో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ (6) వారికన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్న తెలుగు కుర్రాడు యశస్వీ మాత్రం రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
కడపాటి వార్తలందేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసి, 122 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక టీమిండియా ఓపెనర్లలో ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా యశస్వీ నిలిచాడు. అంతకుముందు శిఖర్ ధావన్ 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 187 పరుగులు సాధించాడు. 2018లో రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా తన ఆరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో 134 పరుగులు చేశాడు.
వెస్టిండీస్‌పై రికార్డు భాగస్వామ్యం..
ఇక ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ తొలి వికెట్‌కు 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కరేబియన్ జట్టుపై భారత ఓపెనర్లు చేసిన అత్యధిక పరుగులివే కావడం గమనార్హం. అంతకుముందు 2002లో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ బంగర్ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 201 పరుగులు చేశారు. 2006లో వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ ఓపెనింగ్‌గా వచ్చి 159 పరుగులు నమోదు చేశారు.