మోడీ బీసీ కాదు ఓసీ

0
43

– అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ
– తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఓబీసీకి చెందిన వ్యక్తి కాదని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. ’రాహుల్ ప్రకటనపై వాస్తవాలు’ అంటూ మోడీ జన్మించిన కులం గురించి స్పష్టతనిచ్చింది. ప్రధాని మోడీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు. గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్ కింద ఓబీసీ జాబితాను తయారుచేసింది.

అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉంది. దీనిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు మోడీ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు ప్రకటనలు ఇచ్చిన సమయంలో మోడీ అధికారంలో లేరు’ అని కేంద్రం వెల్లడించింది. ఎన్నికల సమయంలో మాత్రమే మోడీకి తాను ఓబీసీననే విషయం గుర్తుకువస్తుందని కొద్దిరోజుల క్రితం రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే.

లేకపోతే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని చెప్తారన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోడీ స్పందించారు. ’దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం’ అని వెల్లడించారు.

అయితే మోడీ తన కులం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని ఝార్సుగూడలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆయన మాట్లాడుతూ.. మోడీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని.. జనరల్ కేటగిరీకి చెందిన వారని ఆరోపించారు. ఆయన తన కులం గురించి అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ’మోడీ ఓబీసీ కాదు. గుజరాత్‌లోని తెలీ కులంలో జన్మించారు. 2000 సంవత్సరంలో ఆయన కులాన్ని ఓబీసీల్లోకి మార్చారు.

అగ్రవర్ణ కులాల్లో జన్మించినందుకే ఆయన కులగణనకు వెనకాడుతున్నారు’ అని రాహుల్ అన్నారు. ఆయన చేపట్టిన న్యాయ్ యాత్ర గురువారం ఒడిశా నుంచి చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ పార్టీ నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లో అధికారం కోల్పోయింది. ఆ తరువాత రాష్ట్రంలో రాహుల్ తొలిసారి పర్యటిస్తున్నారు. జనవరి 14న మణిపుర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఫిబ్రవరి 11న రాయ్‌గఢ్, శక్తి, కోర్బా జిల్లాల విూదుగా సాగనుంది. ఫిబ్రవరి 14న బలరాంపూర్ నుంచి జార్ఖండ్‌లో రాహుల్ అడుగుపెట్టనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here