బరితెగించిన డ్రగ్స్‌ మాఫియా

0
17

– కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులే టార్గెట్‌గా దందా
– తల్లిదండ్రులను హెచ్చరించిన క్రైం బ్రాంచ్‌ పోలీసులు
Students Addict Drugs Hyderabad: ప్రజానావ/హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియా పూర్తిగా బరితెగించింది. ఇన్నాళ్లు ఎవరి కంట పడకుండా దందా చేసిన మాఫియా.. ఇప్పుడు పబ్లిక్‌గానే కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులను టార్గెట్‌ చేసింది.

‘ప్రజానావ’ దినపత్రికకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ మాఫియా 1000 మంది విద్యార్థులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చినట్లు తెలుస్తోంది. విశ్వనగరంగా విరజిల్లుతున్న హైదరాబాద్‌ అడ్డాగా ఈ దందా గత కొంతకాలంగా గుట్టుగా సాగుతుండగా, ఇటీవల డ్రగ్స్‌ మాఫియా కొందరిని నియమించుకొని వారికి టార్గెట్లు విధించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సదరు వ్యక్తులు కార్పొరేట్‌ స్కూళ్లలో చదివే బిగ్‌షాట్‌ల పిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పూర్తిగా బానిసలైన విద్యార్థులకు డ్రగ్స్‌ కావాలంటే మరో ఇద్దరు విద్యార్థులను తీసుకువస్తే మీకు కొనుగోలులో డిస్కౌంట్‌ ఇస్తామని వల వేస్తున్నట్లు సమాచారం. ఈ దందా గత కొద్దిరోజులుగా గుట్టుచప్పడు కాకుండానే నడిచిందని, అయితే విక్రేతలకు టార్గెట్‌ విధించడంతో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే విషయం తెలుసుకున్న క్రైం బ్రాంచ్‌ పోలీసులు డ్రగ్స్‌ మాఫియా ఆట కట్టించే పనిలో పడ్డారు. ముందుగా కార్పొరేట్‌ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించారు.

పిల్లలను పూర్తిగా సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, స్నేహితులతో బయటకు వెళ్లేటప్పడు ఎక్కడికి వెళ్తున్నారో ఆరా తీయాలన్నారు. పిల్లలను పూర్తిగా కంట్రోల్‌లో ఉంచుకోవాలని డ్రగ్స్‌ మాఫియా బారిన పడకుండా చూడాలని హెచ్చరించారు. మరోవైపు ప్రధాన కార్పొరేట్‌ స్కూళ్లపైనా నిఘా ఉంచారు. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలను కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విస్తృతమైన దాడులు నిర్వహించి నగరంలో డ్రగ్స్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసినా మాఫియా బరితెగించడంతో పోలీసులు సైతం వీరిపై ఉక్కుపాదం మోపెందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here