మన అకాడమీలు.. పతకాలు పండించే ప్రాంగణాలవ్వాలి

0
26

– స్పోర్ట్స్‌ స్కూళ్లు, అకాడమీల ఎంపికలకు సెలక్షన్స్‌ కమిటీలు
– పనితీరు మెరుగుపడాలి.. పర్యవేక్షణ పెరగాలి
– అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్ల సమీక్షలో సాట్స్‌ చైర్మన్‌ డా.ఆంజనేయ గౌడ్‌

ప్రజానావ/స్పోర్ట్స్‌ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్ల పనితీరు మెరుగుపడటానికి నిరంతర పర్యవేక్షణ అవసరం ఉందన్నారు. మన అకాడమీలు.. పతకాలు పండించే ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని స్పోర్ట్స్‌ అథారిటి చైర్మన్‌ డా. ఆంజనేయ గౌడ్‌ అన్నారు. మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో తన కార్యాలయంలో వరుసగా రెండో రోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్లు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి, క్రీడల్లో కాకుండా విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు సాధించే సంస్థలుగా తీర్చి దిద్దబడాలని చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశనం, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచనలను అనుసరిస్తూ అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్ల పనితీరు, మెరుగుదలకు నిరంతర పర్యవేక్షణ, పారదర్శక విధానాలతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగ మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నూతన బోధన శిక్షణ విధానాలను అలవర్చుకోవాలని చైర్మన్‌ అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్ల అధికారాలకు ఆదేశించారు. అకాడమీల స్పోర్ట్స్‌ స్కూళ్లలో క్రీడాకారులు ఎంపికకు వివిధ రంగాల నిష్ణాతులు, అనుభవజ్ఞులచే ‘సెలక్షన్‌ కమిటీ’ ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

అకాడమీలు, స్పోర్ట్స్‌ స్కూళ్ల విద్యార్థులకు రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌లు నిర్వహించాలని, ప్రతి విద్యార్ధి హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలని, డైట్‌ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. అకాడమీలలో అవసరమైన క్రీడా సామగ్రి అందుబాటులో ఉండాలని, శిక్షణ విషయంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, ఎక్కడైనా కోచ్‌ల కొరత, సామగ్రి కొరత ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రతి అకాడమి స్పోర్ట్స్‌ స్కూల్‌లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని నిరంతరంగా సమీక్షించుకోవాలని, ఆయా అకాడమీల్లో క్రీడాకారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలన్నారు.

రెండురోజుల సమావేశంలో వ్యక్తమైన వివిధ అభిప్రాయాలు చర్చకు వచ్చిన అంశాలన్ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని చైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఓఎస్‌డి, ఐఏఎస్‌ డా. కె. లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేకాధికారి డా. హరికృష్ణ, చైర్మన్‌ ఓఎస్‌డీ కె. నర్సయ్య, స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌కే బోస్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌, వనపర్తి డీవైఎస్‌ఓ టి. సుధీర్‌కుమార్‌ రెడ్డి, కరీంనగర్‌ డీవైఎస్‌ఓ రాజవీరు, ఆదిలాబాద్‌ డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్‌రావు, వివిధ అకాడమీల స్పోర్ట్స్‌ స్కూళ్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here