– బీఆర్‌ఎస్ మాటల ప్రభుత్వం
– బీజేపీకి తెలంగాణలో అంతా సీన్ లేదు
– రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
– పార్టీలో చేరిన 50మంది సంకెపెల్లి గ్రామ యువకులు
ప్రజానావ/వేములవాడ రూరల్: ఈసారి రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, బీఆర్‌ఎస్ నేతలకు తప్ప ప్రజలెవరికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదని విమర్శించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ రోజుకో కొత్త పథకాన్ని తెరమీదకు తెస్తుందని, ఎన్ని పథకాలు తెచ్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళితబంధు, గిరిజన బంధు, బీసీలకు రూ.1లక్ష సాయం అంతా భూటకమేనని, ఇప్పటివరకు అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారునికి పథకాలు అందలేదని, బీఆర్‌ఎస్ చేతల ప్రభుత్వం కాదని, కేవలం మాటల ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు.
ఆదివారం ఆది శ్రీనివాస్ సమక్షంలో వేములవాడ మండలం సంకెపల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా యువకులు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ మొన్నటివరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసిందని, తాము తెలంగాణలో అధికారంలోకి రాలేమని తెలిసి బీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందని విమర్శించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు కలిసినా కాంగ్రెస్ గెలుపు లాంఛనమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలతో పాటు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగిందని, అర్హులకు పథకాలన్నీ సజావుగా అందాయన్నారు. తాము అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.