ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎం జగన్‌తో చర్చకు తాను సిద్ధమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
వందల కోట్లు ఖర్చు చేస్తూ.. అధికార దుర్వినియోగంతో ‘సిద్ధం’ సభలు పెడుతున్నారని విమర్శించారు. ‘బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు.. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? ఏ అంశం మీదైనా.. ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే’ అని చంద్రబాబు అన్నారు.
‘ఎవరి పాలన స్వర్ణయుగమో.. ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధాం.. చర్చకు వచ్చే దమ్ముందా జగన్’ అంటూ సవాల్ విసిరారు.
2019లో ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ కానుందని అన్నారు. ఓటమిపై జగన్ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్….పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ది కాదు.. ఏ ఊరుకెళ్లినా జగన్ ఐదేళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
సిద్ధం అని సభలు పెడుతూ జగన్ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
ఓటమి భయంతోనే బదిలీలు
ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడతపెట్టాడని.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు.
అన్ని వర్గాలను మోసం చేసి సామాజిక ద్రోహం చేసిన జగన్‌కు సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదన్నారు.
జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందని పేర్కొన్నారు.
రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారని చంద్రబాబు విమర్శించారు.
సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్టేషన్ తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు.
టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్ పై పేదలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు.