ముందు ఎక్స్‌ప్రెస్‌.. వెనుక పల్లెవెలుగు

0
379

అవును.. మీరు విన్నది.. చూస్తున్నది నిజమే. పల్లె వెలుగు బస్సుకే ముందుభాగంలో ఎక్స్‌ప్రెస్‌ కలరింగ్‌ ఇచ్చారు. ఇది వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించిన దృశ్యం.

ఇటీవల కొత్తగా ఏర్పడిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మహాలక్ష్మి పథకం (మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) ఎఫెక్టే ఇది. ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తప్పుబట్టడం లేదు.

అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని విమర్శించడం లేదు. పల్లె వెలుగు బస్సు ముందుభాగాన్ని ఎక్స్‌ప్రెస్‌లా మార్చితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వేములవాడ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఇవే బస్సులను హైదరాబాద్‌ వంటి సుదూరు ప్రాంతాలకు నడపడం గమనార్హం.

ఇక్కడి బస్టాండ్‌ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు హైదరాబాద్‌కు వెళ్తుంది. దీంతో బస్సు పాయింట్‌ మీదకు రాగానే నిండిపోతుంది.

ఇక్కడివరకు బాగానే ఉన్నా మామూలుగా వేములవాడ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ రావడానికి దాదాపు 4 నుంచి నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

ఇప్పుడు పల్లె వెలుగు బస్సులను కూడా ఇదే రూట్లలో వేయడంతో ఆరున్నర గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహిళలకు ఉచిత పథకం వచ్చినప్పటి నుంచి ఇక్కడి ఆర్టీసీ యాజమాన్యం ఎక్స్‌ప్రెస్‌లను పూర్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో పల్లెవెలుగులను నడుపుతోంది.

ఇక ఇక్కడి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో హైదరాబాద్‌ వెళ్లాలంటే మాత్రం డీలక్స్‌ బస్సే ఆధారం. అయితే ఈ డీలక్స్‌ బస్సులు తక్కువగా ఉండడంతో ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీకావు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడకు శని, ఆది, సోమ, మంగళవారాల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడి శ్రీ రాజరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.

అయితే వేములవాడకు రావాలన్నా.. వేములవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలన్నా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌లే కనిపించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం మహాలక్ష్మి పథకంపై సమీక్షించి మహిళలు, ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసింది.

ఇందులో వేములవాడ డిపోకు అత్యధిక బస్సులు కేటాయించే విధంగా నాయకులతో పాటు అధికారులు ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని స్థానికులతో పాటు భక్తులు సైతం కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here