– నడక దారిలో చిరుత దాడికి గురైన చిన్నారి మృతి
– నరసింహ స్వామి ఆలయం వద్ద మృతదేహం లభ్యం
ప్రజానావ/తిరుమల: తిరుమల నడక దారిలో మరో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి నడకదారిలో తిరుమలకు వస్తున్న క్రమంలో చిరుత దాడికి గురై తప్పిపోయిన చిన్నారి లక్షిత విగతజీవిగా కనిపించింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది. చిన్నారి ఒంటిపై గాయాలు ఉండడంతో చిరుతనే చంపేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే ఓ చిన్నారిపై చిరుత దాడి చేసే ప్రయత్నంలో అక్కడున్న వారంతా గట్టిగా అరవడంతో చిరుత బాలుడిని వదిలేసి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇప్పుడు లక్షిత మృతి చెందడం భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే మెడికల్ రిపోర్టులోనూ పాప చిరుత దాడి చేయడంతోనే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఇక ఈ ఘటనపై డీఎఫ్‌ఓ సతీష్ మాట్లాడుతూ దాడి జరిగిన ఘటనలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఈ దాడి జరిగిన తర్వాత ప్రతి 100మందికి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి గుంపుగా కలిసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ నూతన చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. టీటీడీ భక్తల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.