వైన్స్ టెండర్లకు 15రోజులు.. గృహలక్ష్మి పథకానికి రెండే రోజులు సమయం ఇవ్వడంతో లబ్ధిదారులు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాగుబోతులను తయారు చేసేందుకు తగిన సమయం తీసుకుందని, అదేక్రమంలో ఓ ఇంటిని నిర్మించుకుందాని దరఖాస్తు చేసుకుందామంటే సమయం రెండే రోజులిచ్చిందని రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ అని చెబుతున్నా.. అలాంటప్పడు దరఖాస్తుకు చేసుకునేందుకు సమయం ఎందుకు మెన్షన్ చేశారంటూ ఘాటుగానే స్పందించారు. లబ్ధిదారులకు తోడు ప్రతిపక్షాలు ఏకమవ్వడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. చేసేదిలేక రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ప్రకటన చేపించాల్సి వచ్చింది.
మంత్రిగారు ఏం చెప్పారంటే..
‘సీఎం కేసీఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రూ.3లక్షలు ఆర్థిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామన్నారు.