– నాలుగో టెస్టు డ్రా
– 2-1 తేడాతో సిరీస్ కైవసం
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా, మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటికే మూడో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, కివీస్ చేతుల్లో లంక ఓడిపోవడంతో భారత్ ఫైనల్కు అర్హత సాధించింది. ఇదిలాఉంటే నాలుగో టెస్టు చివరిరోజు ఓవర్ నైట్ స్కోర్ 3/0 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా,78.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి రెండు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా కంటే 84 పరుగుల ఆధిక్యంలో ఉంది. నైట్ వాచ్‌మన్ గా వచ్చిన మథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి అవుట్ కాగా, ట్రావిస్ హెచ్ 163 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మార్నస్ లబుషేన్ 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 2 పోర్లతో 10 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య ఇంగ్లాండ్ లోని ది ఓవల్ మైదానంలో జూన్ 7న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.