- రాష్ట్రంలో 44 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- వనపర్తి, నల్లగొండ, సిద్దిపేటలో అత్యధికం
- హైదరాబాద్ 42 డిగ్రీలు నమోదు
- ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
- ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
ఖైరతాబాద్, ప్రజానావ: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 44 డిగ్రీలకు చేరుకోగా, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.
బుధవారం నల్లగొండ, సిద్దిపేటల్లో 43 డిగ్రీలు నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 42.9 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
హైదరాబాద్‌లోనూ 42 డిగ్రీలకు చేరడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. మరోవైపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
రాష్ట్రంలోని జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తిలో 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
దీంతో తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశముంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం హైదరాబాద్, ఖైరతాబాద్‌లో బుధవారమే 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, సికింద్రాబాద్, చార్మినార్, ముషీరాబాద్, గొల్కొండ, ఆసీఫ్‌నగర్, మారేడుపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు అధిగమించాయి.