నువ్వే శాశ్వతంగా నిద్రపోయావ్!
– ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఇకలేరు
– గుండె సంబంధిత వ్యాధితో అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస
ప్రజానావ/హైదరాబాద్: ‘బానిసలారా లెండిరా.. ఈ బాంచెన్ బతుకులు వద్దురా’ అంటూ ఓటు హక్కు ప్రాధాన్యం తన ఆటాపాటతో కళ్లకు కట్టినట్టు చూపించిన ప్రజా గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్) ఇక శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నాడు. కొన్నిరోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఇటీవలే శస్త్ర చికిత్స కూడా పూర్తయింది. చికిత్స అనంతరం కొలుకునే క్రమంలో ఆదివారం నాడు గద్దర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తెలంగాణ సమాజం బోరుమంది. ఇటీవల ఆస్పత్రి నుంచి ఓ లేఖ విడుదల చేసిన ఆయన త్వరలోనే కొలుకొని ప్రజల్లోకి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు సైతం తన పాటలతో ముచ్చెమటలు పట్టించారు. అనంతరం రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలను కలవడంతో అంతా గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్త ప్రచారంలో ఉండగా, తానే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీనికి ముందు వైఎస్ షర్మిలను కూడా గద్దర్ కలిశారు. ఇదిలాఉంటే గద్దర్ మృతి చెందిన విషయం తెలిసి అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసెంబ్లీ నివాళులర్పించగా, వివిధ పార్టీల నాయకులు, సినీ తారలు ప్రజాయుద్ధ నౌకతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ఉదయం వరకు ప్రజా సందర్శనార్దం గద్దర్ పార్థీవదేహాన్ని ఎల్‌బీ స్డేడియంలోనే ఉంచనున్నారు. అక్కడి నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం, నెక్లెస్ రోడ్డులోని డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్‌లోని (భూదేవి నగర్) తన సొంత నివాసానికి తరలించనున్నారు. గద్దర్ అంత్యక్రియలను ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛనాల నడుమ నిర్వహించనున్నారు.