– శ్రీలంకపై రెండో టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ విజయం
– రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలిన లంక
– ఏడు వికెట్లతో రాణించిన నోమన్ అలీ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గురువారం ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 67.4 ఓవర్లలో 188 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్ (63, నాటౌట్) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత్ కరుణరత్నే (41), నిషాన్ మధుష్క(33) మాత్రమే రాణించారు. పాక్ బౌలర్లలో నోమన్ అలీ 7 వికెట్లు తీయగా, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 576/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ షఫీక్ (201) డబుల్ సెంచరీ సాధించగా, ఆఘా సల్మాన్ (132) సెంచరీతో ఆకట్టుకున్నారు. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0 తేడాతో గెలుచుకుంది. డబుల్ సెంచరీ సాధించిన షఫీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆఘా సల్మాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.