– విశాఖ వన్డేలో భారత్ ఘోర పరాజయం
– ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించిన స్టార్క్
భారత్-ఆస్ట్రేలియాల మధ్య విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే కేవలం 37 ఓవర్లలోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన రోహిత్ సేన 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన అసీస్ 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66), ట్రావిస్ హెడ్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ బ్యాటర్లకు కంగారూలు పరుగులు తీసేందుకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షర్ (29) ఫర్వాలేదనిపించాడు. మిగలిన బ్యాట్స్‌మెన్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక ఈ మ్యాచ్‌లో ఏడుగురు భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, ఇందులో నలుగురు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. టీ20 స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. ప్రత్యర్థి బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీయగా, నాథన్ ఎల్లీస్ 3, అబాట్ 2, గ్రీన్ 1 వికెట్ తీసి జట్టును గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరి వన్డే ఈ నెల 22న చెన్నై వేదికగా జరగనుంది.
బ్యాటింగ్‌లో విఫలమయ్యాం : రోహిత్ శర్మ
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా మేం దారుణంగా విఫలమయ్యాం. స్కోర్ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి మేము తిరిగి కోలుకోలేకపోయామని, మొత్తంమీద ఈరోజు మాకు పూర్తిగా కలిసి రాలేదు అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.