యశస్వి హాఫ్ సెంచరీ

0
37

జురేల్, కుల్దీప్ పోరాటం
చెలరేగిన బషీర్
రాంచీ టెస్టులో ఇంగ్లండ్ పైచేయి

రాంచీ: ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. శనివారం రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది.

తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 134 పరుగులు చేయాలి.

ఆరంభంలోనే..


తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

అండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. అప్పటికీ జట్టు స్కోరు 4 పరుగులే.

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనపై వేసుకున్నారు. సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న యశస్వి ఈసారి కూడా అదే జోరును కొనసాగించాడు.

అతనికి శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 6 ఫోర్లతో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఈ క్రమంలో యశస్వితో కలిసి రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


కొంప ముంచిన అంపైర్స్ కాల్..


నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ అంపైర్స్ కాల్ వల్ల పెవిలియన్ చేరాల్సి వచ్చింది. బషీర్ వేసిన బంతిని ఆడే క్రమంలో గిల్ ప్యాడ్లను తాకింది.

ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనిపై భారత్ డిఆర్‌ఎస్‌కు వెళ్లింది. అక్కడ ఇంపాక్ట్‌లో అంపైర్స్ కాల్ రావడంతో గిల్ పెవిలియన్ చేరక తప్పలేదు.

తర్వాత వచ్చిన యువ ఆటగాడు రజత్ పటీదార్‌తో కలిసి యశస్వి స్కోరును ముందుకు నడిపించాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించారు.

అయితే 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన రజత్ పటీదార్‌ను షోయబ్ బషీర్ ఎల్బీగా ఔట్ చేశాడు. రజత్ కూడా అంపైర్స్ కాల్ వల్ల ఔట్ కావాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు.

12 పరుగులు మాత్రమే చేసి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా యశస్వి తన పోరాటాన్ని కొనసాగించాడు.

ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న యశస్వి 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసిఔటయ్యాడు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు.

53 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక పరుగు మాత్రమే చేసి ఇంటిదారి పట్టాడు. అతను కూడా అంపైర్స్ కాల్‌కు వికెట్‌ను కోల్పోక తప్పలేదు.

ఈ దశలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్ జట్టుకు అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మరో వికెట్ కోల్పోకుండా రెండో రోజు ఆటను ముగించారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన కుల్దీప్ యాదవ్ 72 బంతుల్లో ఒక ఫోర్‌తో 17 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు ధాటిగా ఆడిన ధ్రువ్ జురేల్ 58 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కుల్దీప్, జురేల్ కలిసి 8వ వికెట్‌కు అజేయంగా 42 పరుగులు జోడించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు, టామ్ హార్ట్‌లీ రెండు, అండర్సన్ ఒక వికెట్‌ను పడగొట్టారు.


రాబిన్సన్ హాఫ్ సెంచరీ..


అంతకుముందు 302/7 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓలి రాబిన్సన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

అతనికి జో రూట్ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాబిన్సన్ 96 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన షోయబ్ బషీర్ (0), అండర్సన్ (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ మూడు వికెట్లను కూడా రవీంద్ర జడేజానే పడగొట్టాడు.

మరోవైపు మారథాన్ ఇన్నింగ్స్‌తో అలరించిన రూట్ 274 బంతుల్లో 10 ఫోర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో జడేజా నాలుగు, ఆకాశ్‌దీప్ మూడు, సిరాజ్ రెండు వికెట్లను పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here