ధరణి పెండింగ్ కేసులు 2.45 లక్షలు

0
144

మార్చి మొదటివారంలోగా పరిష్కరించాలి
సీఎం రేవంత్‌రెడ్డి


రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్​లో ఉన్న ధరణిలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు.

ధరణి కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.

భూ సమగ్ర సర్వేతోనే చిక్కులు


2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించడంతో పాటు అప్పుడు మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని, దీంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు.

దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు.

దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది.

ఒక్కో తప్పుకు రూ.వెయ్యి


గత ప్రభుత్వం తప్పిదంతో ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు.

అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది.

ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది.

ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.

కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,

ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి

నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here