క్లారిటీ ఇవ్వండి

0
15

– ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని ఐదు అంశాల పై వివరణ కోరిన గవర్నర్
ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, ఆర్టీసీ కార్మిక నేతలు గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు. కావాలనే బిల్లును అడ్డుకున్నారంటూ విమర్శించారు. ఈ క్రమంలో శనివారం ఆర్టీసీ రెండు గంటల పాటు బస్సులను నిలిపివేసి నిరసనకు కూడా దిగింది. ఇదిలాఉంటే ఉంటే దీనిపై రాజ్‌భవన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో గవర్నర్‌ తమిళిసై ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. వీటిపై స్పష్టత ఇస్తే వీలైనంత తొందరగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు అంశాల్లో ముఖ్యంగా 1958 నుంచి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లు లో పొందుపరచలేదు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యల కు ఇండస్ట్రీయల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని గవర్నర్ రాజ్‌భవన్‌ నుంచి విడుదలైన ప్రకటనలో ప్రస్తావించారు. ఇక విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ వంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని గవర్నర్‌ ప్రభుత్వాన్ని కోరారు. వీలిని వీలైనంత త్వరగా ప్రభుత్వం సమర్పిస్తే బిల్లు అనుమతి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే నిన్నటివరకు గవర్నర్‌ను విమర్శించిన బీఆర్‌ఎస్‌ వర్గాలు.. ఇప్పుడు బంతిని గవర్నర్‌ తమ కోర్టులోనే ఉంచడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆలోచనలో పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here