Engine failure.. Landing in the sea: ఆ విమానం ఇంజిన్ గాల్లోనే ఫెయిలైంది. విషయాన్ని ముందే పసిగట్టిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని నేరుగా సముద్రంలోనే ల్యాండ్ చేశాడు. అయితే విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నా విమానం మాత్రం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన దక్షిణ ఫ్రాన్స్‌లోని ఫ్రెజుస్ తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ప్రాన్స్ (south france) కు చెందిన ఓ చిన్న విమానం ప్రయాణికులతో టేక్ ఆఫ్ అవగా, కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పైలట్ వెంటనే ప్రయాణికులకు విషయం చెప్పి అప్రమత్తం చేశాడు. అయినా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అది గమనించిన పైలట్ నేనున్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపాడు. వెంటనే అధికారులకు ఇంజిన్ ఫెయిల్ అయిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు విమానాన్ని ఫ్రాన్స్ ఫ్రెజుస్ (France Frejus) తీరంలోని బీచ్ వద్ద ల్యాండ్ చేయాలనుకున్నాడు. కానీ అక్కడ భారీగా జనం ఉండడంతో వెనక్కి తగ్గాడు. ఇక చేసేదిలేక బీచ్‌కి కొద్దిదూరంలోనే సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా విమానం మాత్రం క్రమక్రమంగా సముద్రంలో మునగడం ప్రారంభమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, బీచ్ రెస్క్యూ బృందాలు ప్రయాణికులను రక్షించాయి. కానీ విమానం మాత్రం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి ప్రయాణికులను కాపాడిన పైలట్‌ను అందరూ ప్రశంసించారు.