– రైళ్లలో ఆహారం నాణ్యతపై విమర్శలు
న్యూఢిల్లీ: వందే భారత్ రైలును వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా రైలు ప్రయాణికులకు అందించిన ఆహారంలో బొద్దింక రావడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగుచూసింది. సుబోధ్ పహలాజన్ అనే ప్రయాణికుడు గురువారంనాడు భోపాల్ నుంచి గ్వాలియర్ కు ప్రయాణిస్తున్నాడు. అతడు రోటీ ఆర్డర్ ఇచ్చాడు. ఐఆర్ సీటీసీ సిబ్బంది నుంచి రోటి పార్సిల్ అందుకున్న సుబోధ్ తెరిచి చూసే సరికి రోటీతో పాటు మాడిపోయిన బొద్దింక ను చూసి షాక్ కు గురయ్యాడు. దాన్ని ఫొటోతీసి ఐఆర్ సీటీసీని ట్యాగ్ చేస్తూ ట్విటర్ లో ఆ ఫొటోలను షేర్ చేశాడు. స్పందించిన అధికారులు సుబోధ్ కు ఎదురైన అనుభవానికి చింతిస్తున్నామని, ఇలాంటివి తిరిగి జరగకుండా చూసుకుంటామని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే రైల్వే అందించే ఆహారం, దాని నాణ్యతపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ లాంటి రైళ్లలో కూడా ఆహారం నాణ్యత ఇలా ఉండడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.