– ఉమ్మడి వరంగల్‌లో ప్రళయం సృష్టించిన వరుణుడు
– ములుగులో వరద నీటిలో తేలుతున్న మృతదేహాలు
ప్రజానావ/వరంగల్/ములుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుణుడు ప్రళయమే సృష్టించాడు. మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లు వరదల్లో కొట్టుకుపోయారు. శుక్రవారం వరుణుడు కొంత శాంతించడంతో వరదలో మృతదేహాలు తెలియాడుతున్నాయి. గల్లంతైన మరికొందరి కోసం కుటుంబసభ్యులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి కరెంటు తీగలకు తగిలి వేలాడబడ్డ గుర్తుతెలియని యాచకుడి మృతదేహం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇలాంటి చావు మరెవరికీ రావొద్దని ఆ దేవుడిన ప్రార్థిస్తున్నారు. ఇక కొండాయి, మల్యాల గ్రామాలను జంపన్నవాగు వాగు ముంచెత్తగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, మరో ముగ్గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ములుగులో గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్మీ హెలీకాప్టర్ ద్వారా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంకా వాన, వరద ముప్పు పొంచి ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు.