– ఆత్మీయతతో కూడిన సేవలందించాలి
– ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం కలిగేలా వైద్యులు పనిచేయాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజానావ/సిరిసిల్ల: ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలు, చికిత్స, డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా సేవలు అందేలా చూడాలని వైద్యాధికారులు, మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్ లకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి లో ప్రసూతి సేవల కోసం వచ్చే గర్భిణులకు వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఆర్ వ్యవస్థ (మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్) ట్రయల్ రన్ అమలును ఆయన పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల వివరాల నమోదు నుంచి పరీక్షలు, స్కానింగ్, లేబర్ రూం తదితర సేవలను పరిశీలించారు.
అనంతరం ఆస్పత్రుల్లో సేవల గురించి గర్భిణులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. అనంతరం పీఆర్ వ్యవస్థ ప్రభావంతంగా అమలు అయ్యేందుకు వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ వ్యవస్థ అమలులో మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్ పాత్ర ఎంతో కీలకం అన్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నియమించిన 13 మంది మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూవీవ్ లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు.
మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. హెల్త్ సూపర్ వైజర్ లను, వారి సహాయకులుగా ఏర్పాటు చేసిన నర్సింగ్ విద్యార్థును సులభంగా గుర్తించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రెస్ కోడ్ బ్లెజ్ కోట్, స్లీవ్ లెస్ బ్లేజ్ ను విధిగా ధరించాలని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు, గర్భిణులకు అన్ని రకాల వైద్య సేవలను మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూవీవ్ లు, నర్సింగ్ విద్యార్థినులు దగ్గరుండి వివరించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.మురళీధర్ రావు, వేములవాడ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. మహేశ్, మెటర్నిటీ ప్రోగ్రాం అధికారి డా.మహేశ్, ఆర్ఎంఓ డా.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.