– తెలంగాణలో ఆవిర్భవించిన మరో రాజకీయ పార్టీ
– కోర్ కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు ముక్తి భాస్కరరావు
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్ లోని కాప్రా భవానీ నగర్ లో ఆధార్ సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ముక్తి భాస్కర రావు పార్టీ పేరుతో పాటు కోర్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ స్వపరిపాలన లక్ష్యంగా నూతన రాజకీయ పార్టీ అవసరమన్నారు. వివిధ జిల్లాలకు ఆదివాసీ, మేధావులతో చర్చించి ఆదివాసులకు నూతన రాజకీయ పార్టీ అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ‘ఆదివాసీ సమాజ్ పార్టీ’ (ఏఎస్పీ)గా పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కోర్ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ముక్తి భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా గోడం మోతిరాం, కోశాధికారి బోదెబోయిన రామలింగయ్య , ఉపాధ్యక్షుడిగా గొగ్గల రామస్వామి, ప్రచార కార్యదర్శిగా సాగబోయిన పాపారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా గన్నెబోయిన చింపిరయ్య, కల్తీ సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా కోండ్రు సుధా రాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలు అమలు కోసం స్వపరిపాలనే ధ్యేయంగా ఆదివాసులకు రాజకీయ పార్టీ ఆవశ్యకతను గుర్తించి పార్టీ నిర్మాణం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొంది వెంకటరమణ, మెట్ల పాపయ్య, బుగ్గ రామనాథం, ఈసం రవీంద్రబాబు, కొర్రి రాజు, కారం రాము ఆదివాసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.