Bandi sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ ఎమర్జెన్సీకంటే దారుణం

0
111
  • ఇది ప్రతిపక్షాలపై సైబర్ దాడియే
  • రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించిన నీచుడు కేసీఆర్
  • రాధాకిషన్ రావు వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం
  • ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికీ అర్హుడు కాదు
  • వడ్ల స్కామ్‌లో ఉత్తమ్, ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ కేసీఆర్‌ను కాపాడటం వెనుక మతలబు ఏంది?
  • రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్ లను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి
  • సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను గతంలో చెప్పిందే నిజమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించడమే ఇందుకు నిదర్శనం.

రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోంది.

బీజేపీ సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారంటే కేసీఆర్ కు బీజేపీ అంటే ఎంతగా వణుకు పుడుతుందో తెలుస్తోంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

బిడ్డను కాపాడుకునేందుకే..


లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సృష్టించినట్లు రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్‌తో తేలిపోయిందన్నారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్.. అదే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమేనని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమకున్న ప్రత్యేకమైన హక్కులను కాపాడడం దేవుడెరుగు, దేశ పౌరుడికి ఉండే కనీస ప్రాథమిక హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాసిన నీచుడు

కేసీఆర్‌ అని, ఫోన్‌లో భార్యాభర్తల మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేయడం ద్వారా కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు యత్నించిన కిరాతకుడని విమర్శించారు.

‘ఇలాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేగానే కాదు.. భవిష్యత్తులో రాజ్యాంగబద్దంగా ఏ పదవి చేపట్టడానికి కూడా అర్హులు కాదన్నారు. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఇదే పని చేస్తారు.. కాబట్టి అయనపై తక్షణమే అనర్హత వేటు వేయాలి.

మళ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలి. బీఆర్ఎస్ వ్యవస్థాపకుడైన కేసీఆర్ తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన కొడుకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ పాపంలో

భాగం పంచుకున్నందున అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును సైతం రద్దు చేసే అంశంపై ఆలోచించాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?


ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు భారత్ కు రప్పించలేకపోతున్నారని, ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశముంది కదా? అయినా ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు.

తక్షణమే కేసీఆర్ ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలన్నారు.

అలాగే ఈ అంశంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన కోరుతున్నామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here