రైతులెవరూ అధైర్య పడొద్దని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు.
శుక్రవారం వేములవాడ రూరల్ మండలం అనుపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఇప్పటికే పాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని, చివరి దశలో ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సుమారుగా 25 లారీలపైనే ధాన్యం బస్తాలు వెళ్లాయని, కొందరు వ్యక్తులు కావాలనే ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వర్షంతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనడం జరుగుతుందని రైతులెవరూ అధైర్య పడొద్దని కోరారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయాల్లో రాజకీయాలు చేస్తున్నాయని, అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని సల్మాన్ రెడ్డి హితవు పలికారు.
డీసీఓ బుద్ధ నాయక్ సైతం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకూడదని, ప్రతి గింజ కొంటామని స్పష్టం చేశారు.