- ఆస్తుల పంపకాలు తేలేవరకూ తల్లి అంత్యక్రియలు చేయని వారసులు
- బంగారాన్ని పంచుకున్న ముగ్గురు కూతుళ్లు
- డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని మొండికేసిన కొడుకు
- సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
సూర్యాపేట, ప్రజానావ: ఆస్తుల కోసం వారసులు బరితెగించారు. ఓవైపు కన్నతల్లి మృత్యు ఒడిలోకి చేరినా అంత్యక్రియలు నిర్వహించకుండా కొట్లాడుకున్నదారుణమిది.
క్షీణిస్తున్న మానవ సంబంధాలు నిదర్శనంగా నిలిచిన ఈ దారుణం సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా కందులవారిగూడేనికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.
గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి, చిన్న కొడుకు చనిపోయారు. దీంతో లక్ష్మమ్మ గత ఐదేళ్లుగా నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద ఉంటోంది.
ఇటీవల కాలు జారి పడడంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు.
చేసేదిలేక లక్ష్మమ్మను బుధవారం ఆక్సిజన్ సపోర్ట్‌తో చిన్నకూతురు ఇంటికి తీసుకెళ్లింది. రాత్రి 9 గంటలకు అంబులెన్స్ ఇంటివద్దకు చేరుకోగానే లక్ష్మమ్మ కొడుకు అక్కడికి చేరుకొని, తన తల్లిని కందులవారిగూడెం తీసుకెళ్తానని పెద్ద మనుషులను తీసుకొచ్చి పంచాయితీ పెట్టించాడు.
అయితే ఆస్తుల పంపకాలు తేలేవరకూ అంబులెన్స్‌ను కదలనిచ్చేదే లేదని ముగ్గురు కూతుళ్లు పట్టుబట్టారు. అప్పటికే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్న లక్ష్మమ్మ 11 గంటలకు కన్నుమూసింది. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించారు.
ఒడవని పంచాయితీ..
ఓవైపు కన్నతల్లి కన్నమూసినా ఆస్తి కోసం కొడుకు, కూతుళ్ల పంచాయితీ మాత్రం ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో కొందరికి రూ.21 లక్షల వరకు అప్పులిచ్చింది.
ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.
మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు.
ఇక అంత్యక్రియలు చెద్దామనుకున్న సమయంలో కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. దీంతో శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రూ.2లక్షలు ఇప్పించడంతో అంత్యక్రియలను ముగించారు.
గ్రామస్తుల ఆగ్రహం..
ఆస్తి కోసం లక్ష్మమ్మ కొడుకు, కూతుళ్ల నిర్వాకం చూసి గ్రామస్తులు, బంధువులు మండిపడ్డారు. తల్లి శవాన్ని ముందుపెట్టుకొని అంత్యక్రియలు నిర్వహించకుండా గొడవ పడుతారా అంటూ దుమ్మెత్తి పోశారు.
లక్ష్మమ్మ బుధవారం చనిపోతే శవాన్ని ఫ్రిజర్‌లో పెట్టి ఆస్తి కోసం రెండురోజులు తగాదాలు పెట్టుకొని పెద్దమనుష్యుల జోక్యంతో శుక్రవారం అంత్యక్రియలను నిర్వహించారు.