రాష్ట్రంలో గురువారం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగ్గా, రహదారులు చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వం ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చిరించింది.
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కేంద్రీకృతమైనట్లు ఐఎండీ (భారత వాతావరణ శాఖ) పేర్కొంది.
దీని ప్రభావం కారణంగానే ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. రానున్న ఐదు రోజులూ తెలంగాణలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇదిలాఉంటే వాతావరణ శాఖ రాష్ట్ర రైతాంగానికి చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా జూన్ 1 నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 31 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు పేర్కొంది. దీంతో తెలంగాణను పది రోజుల ముందే రుతు పవనాలు తాకనున్నాయి.