వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన
ప్రజానావ, సిరిసిల్ల: జిల్లాలో వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటిని సరఫరా చేయాలని ఉమ్మడి కరీంనగర్ ప్రత్యేక అధికారి, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ అన్నారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు పీ. గౌతమి, ఖీమ్యా నాయక్ లతో కలిసి ఆయన వేసవికాలంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, మండల, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ వేసవికాలంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి వ్యవస్థ, కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
సంక్షోభ సమయంలోనే మన పనితీరు పరీక్షకు గురవుతుందని, మిషన్ భగీరథ అధికారులు, మండల, జిల్లా పరిషత్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
జిల్లాలో తాగునీటి వ్యవస్థ, మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం అందుతున్న తాగునీటి వివరాలను మండలాల వారీగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ప్రస్తుతం మిడ్ మానేర్ డ్యాం లో 7.72 టీఎంసీల నీరు ఉందని త్రాగు నీటి సరఫరా కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంచాలకులు సూచించారు.
వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉందని, అప్పుడు స్థానికంగా ఉన్న ఇతర నీటి వనరులను వినియోగించుకోవాలన్నారు.
తెలిపారు. ప్రస్తుతం మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాధ్ వద్దకు ముందుగా నీరు చేరుకునే విధంగా చూడాలని అన్నారు.
పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం: కలెక్టర్ అనురాగ్ జయంతి
కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో, వేములవాడ, సిరిసిల్ల మున్సిపాల్టీలలో ఉన్న బోరు బావులు, పంపులు, స్థానిక నీటి వనరులను గుర్తించి వాటికి అవసరమైన మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద సిరిసిల్ల జిల్లాలో తాగునీటి సరఫరా సజావుగా నిర్వహించేందుకు 136 పనులకు రూ.2.49 కోట్లు మంజూరు చేసి, ఇప్పటివరకు 60 పనులు పూర్తి చేశామని, మిగిలిన 75 పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, తాగునీటి సరఫరా పై ఫిర్యాదులు ఉంటే 9398684240 ఫోన్ నెంబర్ కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం అగ్రహారంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సందర్శించి మోటార్ల పనితీరును పరిశీలించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఉమారాణి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈఈలు జానకి, విజయ్, భూగర్భ జల శాఖ అధికారి నర్సింహులు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, ఎంపీడీవోలు, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు.