elections: ఎన్నికల నిర్వహణపై అవగాహన

0
13

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సిరిసిల్ల కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై సెక్టార్ అధికారులు, పోలీస్ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ అఖీల్ మహాజన్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికను ఒక కొత్త ఎన్నికగా పరిగణించాలని, ఎన్నికల కమిషన్ మనకు కేటాయించిన విధులను ఎటువంటి అలసత్వం వహించకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలని, ఎన్నికల సందర్భంగా ఏ చిన్న పొరపాటు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 547 పోలింగ్ కేంద్రాలకు 57 సెక్టర్ల పరిధిలో వస్తాయని, సదురు పోలింగ్ కేంద్రాల్లో సజావుగా పోలింగ్ జరిగేలా సెక్టార్ అధికారులు బాధ్యత వహించాలని, సెక్టార్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల రూట్ లను ముందస్తుగా పోలీసు అధికారులతో కలిసి పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలి


వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, సెక్టర్ అధికారులు ముందస్తుగా వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ర్యాంపు,

తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం వెలుతురు మొదలగు ఏర్పాట్లు పరిశీలించాలని, అదేవిధంగా పోలింగ్ నాడు అవసరమైన మేర తాగునీరు, ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం యంత్రాల ప్రొటోకాల్ పాటించాలని, ఈవీఎం యంత్రాలను ప్రభుత్వ వాహనాలలో మాత్రమే తరలించాలని, రిజర్వ్ ఈవీఎం యంత్రాలపై

తప్పనిసరిగా స్టిక్కర్లు ఉండాలని, గత ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలను పరిశీలించి మన దగ్గర ఎటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సమయంలో నియమ నిబంధనల పై అధికారులకు పట్టు ఉండాలన్నారు.

ఎన్నికల సందర్భంగా నిర్వహించే తనిఖీల్లో ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించవద్దని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పీ.గౌతమి, ఖీమ్యానాయక్ , సిరిసిల్ల , వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారులు రమేశ్‌, రాజేశ్వర్, సెక్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here