రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో అక్రమంగా నిలువ చేసిన పేలుడు పదార్థాలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ట్రెయినీ ఎస్పీ రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి 1,392 జిలెటెన్ స్టిక్స్, 897 డిటోనేటర్లు, 196 ఫ్యూజ్‌లను సీజ్ చేశారు. ట్రెయినీ ఎస్పీ రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన మిరాల భాస్కర్ జిల్లెల్ల గ్రామ శివారులో శాంభవి స్టోన్ క్రషర్‌లో భాగస్వామి.
నాలుగు నెలల క్రితం అనుమతులు లేకుండా 83ఎంఎం 87 జిలిటెన్ స్టిక్స్, 25ఎంఎం 249 జిలెటెన్ స్టిక్స్, 10 మీటర్ల రెడ్‌వైర్ కొని క్రషర్ ప్రాంతంలో దాచిపెట్టాడు. అతనితో పాటు ఓబులాపూర్‌కు చెందిన చేమంతి స్టోన్ క్రషర్ యజమానులు మడుకు శ్రీకాంత్‌రెడ్డి, కాసారం సాగర్‌బాబు అనుమతులు లేకుండా అక్రమంగా 25ఎంఎం 1,056 జిలెటెన్ స్టిక్స్, 897 డిటోనేటర్లు, 196 ఫ్యూజులు నిల్వ ఉంచారు.
విశ్వసనీయ సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.