ఖైరతాబాద్‌లో మళ్లీ రాజకీయ లొల్లీ!

0
173
  • దానం రాకతో పార్టీలో నైరాశ్యం
  • సికింద్రాబాద్‌ ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీపై ఒత్తిడి
  • ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా విజయారెడ్డిని గెలిపించుకుంటామంటున్న నేతలు
  • నేడు సీఎం రేవంత్‌ రెడ్డితో విజయారెడ్డి భేటీ?

(కిషోర్‌ సిరిసిల్ల, పొలిటికల్‌ బ్యూరో)

ఎలక్షన్‌ కమిషన్‌ పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.

నిన్న, మొన్నటివరకు పరిపాలనపైనే దృష్టి సారించామని, ఎలక్షన్‌ కోడ్‌ కూడా అమల్లోకి రావడంతో ఇక పూర్తిస్థాయి రాజకీయ నేతగా వ్యవహరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా చేరికలకు ఒక గేటు తెరిచామని ప్రకటించిన గంటలోనే కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీప్‌దాస్‌ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఈ ఇద్దరు నేతలు రాష్ట్రంలో అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

ఇటీవల వీరిద్దరూ రేవంత్‌ రెడ్డి, దీప్‌దాస్‌ మున్షీని కలిసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

అయితే ఇందులో ఎంపీ రంజిత్‌ రెడ్డి చేరికకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకానప్పటికీ ఎమ్మెల్యే దానం రాకను మాత్రం కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

ఖైరతాబాద్‌, జూబ్లీహిల్‌ డివిజన్లతో పాటు బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన నాయకులు ‘దానం పార్టీలోకి వద్దంటే వద్దు’ అని ఆందోళనలకు దిగారు.

ఇక ప్రకాశ్‌నగర్‌కు చెందిన నేతలైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఫ్లెక్సీలతో దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ గాంధీ భవన్‌ ఎదుట నిరసన చేపట్టారు.

వీరికి ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మిగతా డివిజన్ల నాయకులు కూడా తోడవడంతో దానం నాగేందర్‌ను పార్టీ రాష్ట్ర పెద్దలు పార్టీలో చేర్చుకుంటారా.. లేదా? అనే సందిగ్ధత నెలకొంది.

అయితే అనూహ్యంగా ఆదివారం ఉదయమే వీరిద్దరూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

షరతులతోనే చేరారా?


ఇదిలాఉంటే ఎంపీ రంజిత్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షరతులతోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

రంజిత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం చేవెళ్ల నుంచే ఎంపీగా బరిలోకి దింపే ఆలోచన చేయగా, దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి సికింద్రాబాద్‌ పార్లమెంట్ నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని దానంతోనూ చర్చించినట్లు సమాచారం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బరిలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బరిలో ఉండనుండగా, అందుకు తగ్గట్లుగా దానం నాగేందర్‌ను పోటీలో ఉంచేలా కాంగ్రెస్‌ సమాలోచన చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ వార్త అన్నీ మీడియాల్లో వైరల్‌ కావడంతో దీనిపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ క్లారిటీ కూడా ఇచ్చారు.

తాను సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తాననడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారనేది గందరగోళంగా మారింది.

విజయారెడ్డి పరిస్థితి ఏంటి?


ఇదిలాఉంటే ఒకవేళ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎంపీగా పోటీ చేయకుంటే ఖైరతాబాద్‌ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారనున్నాయి.

గతంలో కాంగ్రెస్‌ నుంచే బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన దానం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన విజయారెడ్డిపై విజయం సాధించారు.

అయితే బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచన చేసిన దానం కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే దానం తన రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పీజేఆర్‌ కూతరు, కార్పొరేటర్‌ విజయారెడ్డి అన్నీ తానై పార్టీని నడిపించింది.

ఒక మహిళ అయినా అప్పటి అధికార పార్టీని ఎదురించి నిలిచింది. నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఎవరికి ఏఅన్యాయం జరిగినా నేనున్నానంటూ అక్కడి వెళ్లి సమస్యలు పరిష్కరించేది.

రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న నేతలా పార్టీని ఒంటిచేతిపై నడిపించింది. ఇప్పుడు దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్‌లో ఉంటే.. విజయారెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

విజయా రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని అయినా దగ్గరుండి చూసుకునేది.

ఎలాంటి అవినీతి మరకలు లేని నేతగా, తండ్రికి తగ్గ కూతురిగా విజయారెడ్డి ముందుకు సాగుతోంది.

అందరి సపోర్ట్‌ ఆమెకే..
పదేళ్లకు పైగా అధికారంలో లేకపోయినా పార్టీని ఒంటిచెత్తే ముందుకు నడిపిన విజయారెడ్డిపై రాష్ట్ర నాయకత్వం పూర్తిగా నమ్మకం ఉంచింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రభుత్వంలోని కొందరు పెద్దల సపోర్ట్‌ తనకు ఉన్నా.. ఏ పదవి ఆశించలేదంటే ఆమెకు రాజకీయంపై ఆమె ఎంతలా అవపోసన పట్టిందో అర్థమవుతోంది.

రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అవినీతిఆ మరక లేకుండా తనకు అప్పగించిన పనిని పూర్తిచేసుకుంటూ ముందుకు సాగుతోంది.

అయితే దానం నాగేందర్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు రాష్ట్ర నాయకత్వంపై అలకబూనారు.

ఇదిలాఉంటే దానం నాగేందర్‌ను సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా బరిలోకి దింపితే ఖైరతాబాద్‌లో విజయారెడ్డిని గెలిపించుకుంటామని వారంతా భావిస్తున్నారు.

పార్టీ కోసం కుటుంబానికి దూరమైన ఓ మహిళకు ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరగనివ్వొద్దంటూ వారు బలంగా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే విన్నవించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇదే విషయమై విజయారెడ్డి సైతం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here