హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. లైంగిక ఆరోపణల వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఆయనపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది.
మేడ్చల్ జిల్లాలోనకి హకీంపేట స్పోర్ట్స్ పాఠశాల బాలికలపై హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతేడాది ఆగస్టు 13న కొంతమంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా ఎంఎల్‌సీ కవిత తీవ్రంగా స్పందించింది. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అప్పటి క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు.
దీంతో ప్రభుత్వం వెంటనే ఓ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఓఎస్డీ హరికృష్ణతో పాటు అధికారులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సిబ్బంది విచారించిన కమిటీ వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
మరోవైపు బాధిత విద్యార్థినుల నుంచి రాతపూర్వక స్టేట్‌మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో బాలికలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు.
ఇదే విషయమై హరికృష్ణ మాట్లాడుతూ తను ఎలాంటి తప్పుచేయలేదని, కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా తన సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎంక్వయిరీ కమిటీనూ ఎలాంటి లైంగిక ఆరోపణలు రుజువు కాకపోవడంతో హైకోర్టు హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేసింది.