– ఈవో మార్పుతో ఆలయ పాలనపై భక్తుల ఆసక్తి
– ఇకనైనా మార్పు జరిగేనా అంటూ భక్తుల ఎదురుచూపు
ప్రజానావ/వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈవో బదిలీపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ లో ఏవోగా విధులు నిర్వహిస్తున్న బి. గంగయ్యకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ వేములవాడ రాజన్న ఆలయ ఈవో గా బదిలీ చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అధికారుల వైఫల్యం.. ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. జిల్లాలో పరిస్థితులపై అవగాహన ఉన్న అధికారి గంగయ్యకు ఆలయ ఈవోగా పదోన్నతి కల్పించడంతో ఆలయ పాలన గాడిలో పడేనా అన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈవోగా నియామకమైన గంగయ్య స్వగ్రామం చొప్పదండి. 2007లో గ్రూప్ -2 లో డిప్యూటీ తహసీల్దార్ గా మొదట ఎంపికయ్యారు. 2014 నుంచి సిరిసిల్ల ప్రాంతంలో తహసీల్దార్ గా సేవలందించారు. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ పరిపాలన అధికారిగా ఆరున్నరేళ్ల నుండి సేవలందిస్తున్నారు.