– కొందరికే మినహాయింపు ఎందుకు?
– తహసీల్దార్ల బదిలీలపై పలువురి అసహనం
– తెలంగాణవ్యాప్తంగా 417మంది బదిలీ
ప్రజానావ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 417మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ బదిలీలు ఎలక్షన్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమేనన్నట్లు తెలుస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఇందులో చాలామంది తహసీల్దార్లు ఒకేచోట ఏళ్లుగా పనిచేస్తున్నా వారిని బదిలీ చేయకుండా అలాగే కొనసాగిస్తున్నారని పలువురు తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తమ అసహనాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. కేవలం మల్టీ జోన్-2 పరిధిలోని వారిని మాత్రమే బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నల్లగొండ జిల్లా వారిని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకి, మేడ్చల్ జిల్లా నుంచి జనగామ, మేడ్చల్ నుంచి రంగారెడ్డికి, సూర్యాపేట జిల్లా నుంచి జనగామ, వనపర్తి జిల్లా నుంచి నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి, గద్వాలకు, సంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్, వికారాబాద్‌కి బదిలీలు జరిగాయి. అంటే సొంత జిల్లాల్లో తహసీల్దార్లు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించకుండా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న కొంతమంది తహసీల్దార్లకు ఎలాంటి బదిలీ జరగలేదు. వారిని ఎందుకు బదిలీ చేయలేదనే చర్చ ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు అక్కడే తిష్ఠవేయడంతో అసలేం జరిగి ఉంటుందనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఇవన్నీ నగర శివారులోని మండలాలే కావడంతో వీరికి అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.