ఇప్పుడు ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. యూఐడీఏఐ ఎప్పటికప్పడు ఆధార్ అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. ఓటర్ ఐడీ, పాన్‌కార్డు ఇలా ప్రతి ఒక్కకార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిందే.
అయితే తాజాగా ఆధార్ తీసుకొని పదేళ్లు అవుతున్నవారి వివరాలను ఆధార్‌లో ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దీనికి జూన్ 14 గడువు పెట్టింది. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి.
యూఐడీఏఐ చెప్పిన ప్రకారం జూన్ 14లోపు ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోతే ఇక ఆధార్ పనిచేయదని వదంతులు సృష్టిస్తున్నారు. దీనిపై యూఐడీఏఐ స్పందించింది. ఎవరూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పుకార్లను నమ్మవద్దని సూచించింది.
ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకు గడువు ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఈలోపు అప్‌డేట్ చేసుకున్నవారికి ఉచితమని, ఆ తర్వాత అంటే జూన్ 14 తర్వాత అప్‌డేట్ చేసుకుంటే మాత్రం కొంత ఛార్జి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది.
ఆధార్‌లో పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పదేళ్లకోసారి తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 14 వరకు ఉన్న గడువును యూఐడీఏఐ జూన్ 14వరకు పొడిగించిన విషయం తెలిసిందే.