మూడు ఫార్మాట్లలో తొలి స్థానంలో భారత జట్టు
ఇప్పటికే వన్డేలు, టీ20లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌లోనూ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్ కంగారూలను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం రోహిత్ సేన 115 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (111 ) రెండో స్థానం, ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి స్థానాల్లో వరుసగా కొనసాగుతున్నాయి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టిన అశ్విన్, జడేజాలు సైతం తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. అశ్విన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలవగా, జడేజా 16వ స్థానంలో నిలిచాడు.