- వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం
- చైన్నైపై గెలుపుతో ప్లేఆఫ్స్‌కు
భళా బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ మైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఆరు వరుస ఓటములు తర్వాత తిరిగి పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుసగా ఆరు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాలు సాధించి సగర్వంగా ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది.
అసలు ఏమాత్రం నాకౌట్‌కు చేరుకునే అవకాశం లేకున్నా ఆల్‌రౌండ్ షోతో వరుస విజయాలను చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 14 మ్యాచులాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచుల్లో ఓడిపోగా, మరో ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది.
శనివారం చెన్నైతో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 218 పరుగులు చేసింది.
కెప్టెణ్ ఫాఫ్ డుప్లెసిస్ (54) అర్ధ సెంచరీ సాధించగా, ఓపెనర్ విరాట్ కోహ్లీ (47), రజత్ పటీదార్ (41), కామెరూన్ గ్రీన్ (38 నాటౌట్) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు సైతం వారు ఆడిన బంతులకంటే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రచిన్ రవీంద్ర (61), రహానే (33)తో పాటు చివర్లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (25), రవీంద్ర జడేజా (41) రాణించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలాఉంటే చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే 12 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా, ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్‌లో రవీంద్ర జడేజా ఒక సిక్సర్ పాటు బౌండర్ బాదాడు.
ధోనీ సైతం బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్‌లో 18 పరగులు వచ్చాయి. దీంతో సమీకరణ 6 బంతుల్లో 17 పరుగులకు చేరింది. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన ధోనీ ఆ తర్వాతి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాతి రెండు బంతుల్లో యశ్ రెండు పరుగులే ఇవ్వగా, చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే చివరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రవీంద్ర జడేజా ఉండడంతో అంతా టెన్షన్ నెలకొంది.
అభిమానులంతా గతేడాది ఐపీఎల్ ఫైనల్‌ను గుర్తుచేసుకోగా.. ఈసారి మాత్రం జడేజా ఎలాంటి మాయచేయలేదు. చివరి రెండు బంతులకు ఒక్కపరుగు కూడా రాకపోవడంతో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.