- బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే..
- మెదక్ పార్లమెంట్ సీటు మనకు ప్రతిష్టాత్మకం
- గతంలో మహానేత ఇందిరాగాంధీ ఇక్కడినుంచే ప్రాతినిధ్యం
- గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి చేయండి
- మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్, ప్రజానావ: ‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పనైపోయింది.. బీజేపీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానం ప్రత్యేకమైనదని, ఇక్కడినుంచే మహానేత ఇందిరాగాంధీ ప్రాతినధ్యం వహించారని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల్లో గెలుపుతో ఇక్కడ కాంగ్రెస్‌కు గత వైభవం తీసుకొద్దామన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ సీటును సునాయసంగా గెలుస్తామన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుతో ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరిగిందని, మనం చేసే పథకాలనే అస్త్రంగా చేసుకొని ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని సూచించారు.
ఇందుకోసం మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పఠాన్ చెరు,
నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పూజాల హరికృష్ణతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.