AADHI | నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా

0
18

గత ప్రభుత్వం మన ప్రాంతానికి చేసిందేమీ లేదు
చెరువు నిర్మాణాలను గాలికొదిలేశారు
ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

ప్రజానావ చందుర్తి: మీలో ఒకడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

బుధవారం ఆయన చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఛత్రపతి శివాజీ వర్ధంతి, దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.


మొన్నటి ఎన్నికల్లో తన గెలుపులో భాగస్వామ్యమైన జోగాపూర్ ప్రజానీకానికి చందుర్తి మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అటువైపు వ్యాపారవేత్తలు, ధనవంతులు డబ్బుల వర్షం కురిపించినా మీరందరూ నన్ను మీ బిడ్డగా చూసుకుంటూ నా గెలుపునకు తోడ్పాటు అందించారన్నారు.

గత పాలకులు ఎమ్మెల్యే పదవిని వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధి, ప్రజాసేవ కోసం కాదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.

చందుర్తి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మల్యాలకు తీసుకొచ్చి ఇక్కడి రైతాంగానికి ఉపయోగపడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించానని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క కాలువ కూడా తవ్వలేదన్నారు.

మేం వచ్చాకే కాంట్రాక్టర్లకు బిల్లులు


జోగాపూర్ లోని గురునాథం చెరువు, ఆశిరెడ్డిపల్లి పరిధిలోని కొత్త చెరువు, సనుగుల ఎర్ర చెరువు, పటేల్ చెరువు, కలికోట సూరమ్మ చెరువు నిర్మాణాలను గాలికొదిలేశారని ఆది శ్రీనివాస్‌ విమర్శించారు.

ఆనాడు చేసిన పనులకు కాంట్రాక్టర్లుకు బిల్లులను కూడా సరిగా చెల్లించలేదని, మేం అధికారంలోకి వచ్చాక చెల్లించామని చెప్పారు. జోగాపూర్ పరిధిలోని రైతులకు వర్షాకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా కల్వర్డ్ల నిర్మాణం చేపడతామని, హై లెవల్ వంతెనల నిర్మాణం చేపడతామన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తుచేశారు. త్వరలోనే చందుర్తి మండల పరిధిలోని ప్రాజెక్టులలన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

రైతు భరోసాపై అనవసర రాద్ధాంతం


రైతు భరోసాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇప్పటివరకు ఐదెకరాలలోపు రైతు భరోసా ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతుబంధు ఇచ్చిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు.

మా ప్రభుత్వాన్ని కూల్చుతామని బావ బామ్మర్దులు, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని, పదేళ్లు అధికారం అనుభవించి నేడు అధికారం కోల్పోగానే మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని ఏం చేయలేరన్నారు. బావా బామ్మర్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందన్నారు.

రానున్న రోజుల్లో సాగు, తాగునీరు, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మడెల్లయ్య స్వామి జాతర ఉత్సవంలో..


కోనరావుపేట: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మడెల్లయ్య స్వామి వారి జాతర మహోత్సవంలో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం రజక సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పెంతల శ్రీనివాస్, మానుక సత్యం, అజీమ్ పాషా, సదానందం, అవధూత శ్రీధర్,

నాగండ్ల భూమేశ్‌, లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేశ్‌ నాయక్, రజక సంఘం నాయకులు మారుపాక లింబయ్య, లోకుర్తి శ్రీను, కొత్తకొండ దేవయ్య, మారుపాక హానోక్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here