బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదల కోసం మానవీయ కోణంలో కేసీఆర్ అమలు చేసిన అనేక పథకాలను రేవంత్‌రెడ్డి సర్కార్ నిలిపేసిందని బీఆర్‌ఎస్ పేర్కొంది.
విదేశీ విద్యానిధి, దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ ఇలా అనేక పథకాలను పెండింగ్‌లో పెట్టిందని ఎక్స్‌లో విమర్శించింది.
‘ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కేసీఆర్ ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆశించిన స్థాయికి మించి సత్ఫలితాలను సాధించింది.
రాష్ట్రంలో సరికొత్త సామాజిక విప్లవానికి బాటలు వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతా అస్తవ్యస్తంగా మారింది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.