తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల ఉద్యోగాలకు భద్రత లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమె మండిపడ్డారు.
ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలంటూ సోమవారం ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు.
దాంతో జవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు.
రోస్టర్ పాయింట్ల రద్దుతో మహిళలకు ఉద్యోగాలు దారుణంగా తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ జీవో 3 కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకే వర్తిసుందా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకూ వర్తిస్తుందా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.