మీ అందరి కృషితోనే అధికారంలోకి..

0
21

ప్రత్యేక రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది
పంచాయతీ రాజ్​ సంఘటన్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

ప్రజానావ, హైదరాబాద్‌ బ్యూరో: మీ అందరి కృషితోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడి నుంచి మంత్రి వరకు అయ్యానని పంచాయతీ రాజ్​ సంఘటన్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

శనివారం పంచాయతీ రాజ్​ సంఘటన్‌ రాష్ట్రస్థాయి సమావేశం శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు.

తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నామని, కానీ గత పదేళ్లలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

చాలా గ్రామాల్లో బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా పంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ద్వారా మీనాక్షి నటరాజన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి.. తాను కరీంనగర్ నుంచి ఒకేసారి ఎంపీగా గెలిచామన్నారు. వారు పార్లమెంట్ లో తెలంగాణ కోసం మాకు మద్దతుగా నిలబడ్డారని గుర్తుచేశారు.

ఈ రోజు వారి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ద్వారా మరింత ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. అధికారాలను వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళ్దామని, పంచాయతీ రాజ్‌, మున్సిపాలిటీల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చట్టాలు ఉంటాయన్నారు.

ధరణి సమస్యలు, అటవీ రక్షణ, ప్రకృతి చర్యలపై మరింత ముందుకు వెళ్లాలన్నారు. గ్రామీణ స్థాయి సంఘటన్ ద్వారా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను తీసుకుపోవాలని సూచించారు.

ఇప్పటివరకు కార్యక్రమాల్లో చురుగ్గా ఎలా పాల్గొన్నారో.. మీ హక్కుగా రావాల్సిన వాటిపై మీకు అండగా ఉంటానని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here