- యెన్నం, కేకే మహేందర్ రెడ్డిలకు కూడా..
- మీడియాకూ స్ట్రాంగ్ వార్నింగ్
ఖైరతాబాద్, ప్రజానావ: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా నోటీసులు పంపించారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు.
లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు.
‘నిరాధారమైన, మతిలేని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో లీగల్ నోటీసులు.. పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని మంగళవారమే మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ హెచ్చరించారు.
హెచ్చరించినట్టే లీగల్ నోటీసులు పంపించారు. వాస్తవాలను సరి చూసుకోకుండా.. ఇలాంటి వార్తలను ప్రచురించే మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
తవ్వేకొద్దీ సంచలనాలు..
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ కేసులో తవ్వే కొద్దే సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా చేర్చారు.
డీఎస్పీ ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుంలో మరింత మంది అధికారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.