– హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన
ప్రజానావ/హైదరాబాద్: మహానగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. మూడ్రోజులు ఎడతెరిపి ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా దంచికొట్టాడు. సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా వాన పడడంతో ప్రజలు భయాందోళన చెందారు. అప్పటికే నగరమంతా తడిసిపోయింది. దీంతో ఎప్పటిలాగే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అశోక్‌నగర్, లక్డీకపూల్, రామంతపూర్, అంబర్‌పేట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, ఉప్పల్, పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇదిలాఉంటే వర్షం కారణంగా సెక్రటేరియట్ ముందు మళ్లీ వర్షం నీరు నిలవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోవడంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.