టౌంటన్: ఉమెన్స్ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ మహిళా జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. స్కీవర్ బ్రంట్ (129) అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ నైట్ (67), వ్యాట్ (43) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్‌నర్, జొనస్సెన్ మూడేసి వికెట్లు పడగొట్టగా, షుట్, కింగ్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించి, 269 పరుగులను టార్గెట్‌గా నిర్ణయించారు. ఎల్లిసె పెర్రీ (53), యాష్లె గార్డ్‌నర్ (41) మినహా మరెవరూ రాణించకపోవడంతో 35.3 ఓవర్లలోనే ఆసీస్ జట్టు 199 పరుగులు చేసి ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నట్ స్కీవర్ బ్రంట్ దక్కించుకోగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను యాష్లే గార్డ్‌ణర్, నట్ స్కీవర్ బ్రంట్‌లు అందుకున్నారు. ఇదిలాఉంటే యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. ఇక వన్డే సిరీస్‌ను సైతం ఇంగ్లీష్ మహిళా జట్టు 2-1 తేడాతో దక్కించుకుంది.