పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయండి
వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజానావ, సిరిసిల్ల: ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు రావొద్దని, అన్ని గ్రామాలకు నిత్యం నీటిని సరఫరా చేసేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూలు తదితర అంశాలపై శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామంలో నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. నీటి టాంక్యులు, పైప్ లైన్లలో లీకేజీ, కనెక్షన్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించాలని సూచించారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే స్థానికంగానే పరిష్కరించాలన్నారు. ఎక్కువ ప్రభావితం చూపే విధమైన సమస్యలు ఉంటే మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ కలిసి దానిపై దృష్టి పెట్టాలని, సమస్యను పరిశీలించి పరిష్కరించాలని, మరమ్మత్తు, ఇతర పనులను వచ్చే బుధవారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ఉండాలన్నారు.
బోర్లపై ఆధారపడొద్దు
ప్రతీ ఇంటికి నీరు సరఫరా అయ్యేలా చూడాలని, బోర్ల ద్వారా నీటిని అందించవద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బోర్లపై ఆధారపడాలన్నారు.
అలాగే నీటిని రోజూ క్లోరినేషన్ చేయించాలని, ప్రతి పది రోజులకు ఒకసారి నీటి ట్యాంకులు శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై చెత్తాచెదారం ఉండకూడదని, మురికి కాలువల్లో సిల్ట్ తొలగింపజేయాలని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇండ్ల నుంచి చెత్త సేకరించాలని, తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఇంటి పన్ను వసూలుపై ఆరా తీసిన కలెక్టర్ ఇప్పటివరకు తక్కువ వసూలు చేసిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 100 శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
పంచాయతీల పరిధిలో నూతన భవానాల నిర్మాణానికి చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని, ప్రభుత్వ స్థలాలు, అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇండ్ల నిర్మాణాలకు అనుమతి, ఇంటి పన్ను వసూలుతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 238 వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పని చేసే చోట తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బంది ఉండాలని తెలిపారు.
కూలీలకు 100 రోజులు పని కల్పించాలని, వేతనాలు వచ్చేలా చూడాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని, నీటిని పట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జెడ్పీ సీఈవో ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈ ఈ లు విజయ్, జానకి, తదితరులు పాల్గొన్నారు.