ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని, నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని ప్రయత్నించారని విమర్శించారు.
ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు.
సచివాలయం, కాళేశ్వరం వంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని విమర్శించారు. 75 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్లీ స్వేచ్ఛను తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
అందుకే ప్రజా ప్రభుత్వం
కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని, నిజాం విధానాల నకలును అమలు చేయడంతోనే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు.
వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని రేవంత్ పేర్కొన్నారు. గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళుతున్నామని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లు కవులు, కళాకారులను కేసీఆర్ తన గడీలో బంధించారని, దొరగారి భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని చెప్పారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని, రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామన్నారు.
ఆయనేం పన్నీరు కాదు..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదని సీఎం రేవంత్ విమర్శించారు.
తులసీ వనంలో వారు కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లారని, అవి దుర్గంధం వెదజల్లుతున్నాయని అలాంటి మొక్కల్ని ఒక్కొక్కటిగా పీకేస్తున్నామన్నారు.
జీరో బిల్‌ను మేం అమలు చేస్తుంటే తెలివితేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తోంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారని, వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారన్నారు.
ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళుతున్నామని, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మీ అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరిందని, దీనిపై చట్టబద్ధంగా విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.