బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇటీవల దానం నాగేందర్‌తో పలువురు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, దీప్‌దాస్ మున్షీతో భేటీ అయిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీనిపై నిన్నటివరకు ఎవరూ స్పందించకపోయినా.. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే సంకేతాలిచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ రోజుకోచోట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శనివారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన నేతలు గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారుతానంటూ కాంగ్రెస్ పెద్దలను కలిసిన దానం నాగేందర్‌ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పార్టీలోకి చేర్చుకోవద్దన్నారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా స్థానిక నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం అసభ్య పదజాలంతో దూషించారని వారు గుర్తుచేశారు.
ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న దానం నాగేందర్‌ను పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి బీఆర్‌ఎస్‌లా దిగజారుతుందన్నారు.
ప్రకాశ్‌నగర్ నేతలు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ నేతలు వెంటనే అక్కడకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు.
అయితే స్థానిక నేతల ఆందోళనలను పట్టించుకోని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.
అంతేకాకుండా రంజిత్‌రెడ్డికి ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.