ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
కొండగట్టును అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దే మహా యజ్ఞానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న కొండగట్టును సందర్శించేలా పర్యటన ఖరారైంది. అయితే 14వ తేదీ మంగళవారం కావడం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో పాటు అధికార యంత్రాంగం పూర్తిచేసింది. ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి, 9:05 గంటలకు బేగంటపే విమానాశ్రయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో నాచుపల్లిలోని జేఎన్టీయూకు చేరుకొని, అటు నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు కొండపైనే కేసీఆర్ గడపనున్నారు. బడ్జెట్‌లో కొండగట్టు అంజయనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన దేవాలయ దేవాలయ పునర్నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. దేవాలయ అభివృద్ధికి కావాల్సిన సలహా సూచనలు చేయనున్నారు. యాదాద్రి ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఈ దేవాలయాన్ని పరిశీలించి, నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. ఈ నివేదికపై రేపు అధికారులతో కలిసి సీఎం సమీక్ష చేయనున్నారు.