niveditha: నివేదితకు టికెట్‌ రానిస్తారా?

0
264
  • అధినేత నుంచి లభించిన స్పష్టమైన హామీ
  • వ్యతిరేక వర్గంవైపు సొంతవాళ్లు
  • పోటీలో మరికొందరు

గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన లాస్య నందిత (lasya nanditha) రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.

రాష్ట్ర అసెంబ్లీలో అతి పిన్న వయస్సున్న ఎమ్మెల్యేగా లాస్య గుర్తింపు పొందింది. అయితే ఇటీవల కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే.

అయితే కుటుంబసభ్యురాలిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న లాస్య కుటుంబం ఆమె మరణానంతరం సైలెంట్‌గా ఉంది. ఇదిలాఉంటే పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది.

ఈ ఉప ఎన్నికలో లాస్య సోదరి నివేదిత తను పోటీలో ఉంటున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది.

అంతేకాకుండా ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని కూడా కోరింది. అయితే ఆ తర్వాత తన తల్లితో కలిసి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ ఉప ఎన్నికలో తను పోటీ చేస్తానని, తనకే బీ ఫామ్‌ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పార్టీ అధినేత ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, మౌనం వహించడంతో నిరాశతో వెనుదిరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అధినేత మనసులో ఏముంది?


దివంగత ఎమ్మెల్యే లాస్య మరణానంతరం జరిగే ఉప ఎన్నికలో ఆమె సోదరి నివేదితకు పార్టీ అధినేత టికెట్‌ కన్‌ఫామ్‌ చేయకపోవడంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆయోమయం నెలకొంది.

నివేదిత కుటుంబం బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేసిందని, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే తండ్రి సాయన్న, సోదరి లాస్య నందిత తిరిగిరాని లోకాలకు వెళ్లారని ఇప్పుడు ఆ కుటుంబ నుంచే వస్తున్న నివేదితకే టికెట్‌ ఇవ్వాలిని ఓ వర్గం డిమాండ్‌ చేస్తోంది.

మరోవైపు గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి టికెట్‌ ఆశించిన మన్నె క్రిశాంక్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గజ్జెల నగేశ్‌ కూడా ఈ ఉప ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లోనే కేటీఆర్‌ చెప్పడంతో పోటీ నుంచి తప్పుకున్నామని ఈసారి ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని వారు పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో అధినేత ఎవరికి బీఫామ్‌ ఇవ్వనున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయినా వారు సహకరిస్తారా?


మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి లాస్య నందితకు బీఫామ్‌ ఇవ్వగానే కొంతమంది పార్టీకి దూరందూరంగా ఉన్నారని, ఎన్నికలు సమీపించగానే వ్యతిరేక ప్రచారం కూడా చేశారనే ఆరోపణలున్నాయి.

ఎలాగైనా లాస్యను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారనే వాదనలు కూడా వినిపించాయి.

ఈ క్రమంలో ఆ వర్గం లాస్య నందిత ఏర్పాటు చేసుకున్న వర్గంలోని కొందరిని ఇప్పటికే తమవైపుకు తిప్పుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ఉప ఎన్నికలో నివేదితకు బీఫామ్‌ ఇస్తే పార్టీ తరఫున సహకరిస్తారా.. లేదా దగ్గరుండి ఓడిస్తారా? అసలు బీఫామ్‌ నివేదితకు ఇవ్వనిస్తారా? అనే సందేహాలను సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌


సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. మే 13న పోలింగ్‌ జరగనుండగా, జూన్‌ 4వ తేదీన ఫలితం వెలువడనుంది.

ఎంపీ ఎలక్షన్లతో పాటే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం సహా మరో 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసీ ఉప ఎన్నికలను నిర్వహించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here