– అర్ధ సెంచరీతో రాణించిన ఖవాజా
– జడేజాకు నాలుగు వికెట్లు
– ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 156/4
ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్నమూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతోంది. మొదటి రోజు ముగిసే సమయానికి 156/4తో 47 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో ఒక్క రవీంద్ర జడేజాకే నాలుగు వికెట్లు పడడం విశేషం. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) తొందరగానే పెవిలియన్‌కు చేరినా, ఆ తర్వాత మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా లబుషేన్‌తో కలిసి 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఖవాజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే లబుషేన్ (31) పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌తో జత కట్టిన ఖవాజా (60) పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కొద్దిసేపటికే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (26) కూడా జడేజా బౌలింగ్‌లోనే వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి, 47 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.